ఆ సమయంలో చాలా సిగ్గుగా అనిపించింది: నాగార్జున

  • ఐదో తరగతి చదువుతున్నప్పుడు డ్రామాలో ఆడవేషం వేయించారన్న నాగార్జున
  • అందరూ ఎగతాళి చేయడంతో సిగ్గనిపించిందని వెల్లడి
  • సినిమాల్లో నటించమని తన అన్నయ్య సూచన చేశాడన్న నాగార్జున
తాను ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఒక డ్రామాలో ఆడవేషం వేయించారని, అప్పుడు అందరూ తనను చాలా ఎగతాళి చేశారని ప్రముఖ సినీ నటుడు నాగార్జున అన్నారు. ఆ సమయంలో తనకు చాలా సిగ్గుగా అనిపించిందని పేర్కొన్నారు. నాగార్జున సినిమా పరిశ్రమకు వచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. తాను నటుడిని అవుతాననే చెప్పే ఆనవాళ్లు తన బాల్యంలో ఏవీ లేవని అన్నారు.

తనకు మూడు సంవత్సరాలు ఉన్నప్పుడే హైదరాబాద్‌కు వచ్చేశామని తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివానని, కానీ స్టార్ హీరో నాగశ్వరరావు కొడుకును అనే ప్రత్యేక శ్రద్ధ ఏమీ ఉండేది కాదని అన్నారు. తాను సగటు విద్యార్థిని అని, చదువులో మొదటి ఇరవై స్థానాల్లో ఉండేవాడినని అన్నారు. ఆడవేషం వేసినప్పుడు తనను ఎగతాళి చేయడంతో తాను మళ్లీ డ్రామాల జోలికి వెళ్లలేదని పేర్కొన్నారు.

సుడిగుండాలు చిత్రంలో 30 సెకన్లు మాత్రమే కనిపించే చిన్న పాత్ర వేశానని, తాను మేకప్ వేసుకోవడం అదే మొదటిసారి అన్నారు. చదువు పూర్తయ్యాక ఏడాదిన్నర పాటు అమెరికాలో ఉన్నానని అన్నారు. అక్కడే సెటిల్ అవుదామని ఎప్పుడూ అనుకోలేదని వెల్లడించారు. ఇక్కడకు వచ్చి ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నానని, అప్పుడు ఏదైనా లైసెన్స్ కావాలంటే ఏడాది సమయం పట్టేదని అన్నారు.

అందుకే తాను ఫిల్మ్ ప్రొడక్షన్‌లోకి దిగానని చెప్పారు. అప్పుడే తన అన్నయ్య వెంకట్, తనను సినిమాల్లో నటించమని సూచించాడని పేర్కొన్నారు. అప్పటి వరకు తనకు నటన మీద ఆసక్తి లేదని, కానీ అన్నయ్య చెప్పాక ఆలోచించానని తెలిపారు. 1986లో మొదటి చిత్రం 'విక్రమ్' విడుదలైందని, అది మంచి విజయం సాధించినప్పటికీ విమర్శలు వచ్చాయని అన్నారు. తనను నాన్న గారితో పోల్చి చూడటంతో విమర్శలు వచ్చాయని అన్నారు. సినిమాల్లో జీన్స్ వేసుకోవడం తనతోనే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు.

Nagarjuna
Akkineni Nagarjuna
Telugu cinema
Vikram movie
Tollywood
actor interview
Hyderabad Public School

More Telugu News